Sabarimala: శబరిమల వెళ్లకుండానే ఇంటికి అయ్యప్ప ప్రసాదం!

  • పోస్టల్ డిపార్ట్ మెంటుతో ఒప్పందం కుదుర్చుకున్న దేవస్థానం బోర్డు
  • ఒక్క ప్రసాదం కిట్ ధర రూ. 450
  • పోస్ట్ ఆఫీసులో ఫామ్ పూర్తి చేసి, డబ్బు చెల్లిస్తే ఇంటికే ప్రసాదం
Sabarimala Ayyappa prasadam to be delivered to your home

శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప మాల వేసుకుని శబరిమలకు వెళ్లొచ్చే భక్తులు పెద్ద మొత్తంలో అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకొస్తుంటారు. తమ బంధుమిత్రులకు పంచుతుంటారు. అయితే, కరోనా నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో 2000 మందికి స్వామివారి దర్శనం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చాలా మంది అయ్యప్ప మాలను కూడా ధరించలేదు.

ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్తోం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల ప్రసాదాన్ని భక్తులకు నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్ మెంటుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం కిట్ ధర రూ. 450గా నిర్ణయించారు. ప్రసాదం కావాల్సిన వారు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ప్రసాదం పేరిట ఉన్న ఫామ్ పూర్తి చేసి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వారం రోజుల్లో ప్రసాదం ఇంటికి డోర్ డెలివరీ చేయబడుతుంది.

ప్రసాదం కిట్ లో అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, అష్టోత్తర అర్చన ప్రసాదం, విభూది, నెయ్యి ఉంటాయి. ఒక రిసీట్ పై 10 వరకు ప్రసాదం కిట్లను పొందొచ్చు. అంతకు మించి ప్రసాదం కావాలంటే మరో రిసీట్ తీసుకోవాల్సి ఉంటుంది.

More Telugu News