కరోనా రోగి ఒక్కసారి తుమ్మినా, దగ్గినా 1,000 కరోనా వైరస్ కణాలు బయటికొస్తాయి: తాజా అధ్యయనంలో వెల్లడి

01-12-2020 Tue 13:09
  • ఆస్ట్రియాలో పలు నగరాల్లో పరిశోధన
  • కరోనా రోగుల నుంచి నమూనాలను సేకరించి అధ్యయనం
  • 750 మంది కరోనా రోగుల నుంచి శాంపిళ్లను తీసుకుని పరిశోధన
1000 cells of corona come out from patient if sneezes

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి శాస్త్రవేత్తలు చేస్తోన్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్ట్రియాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో కరోనా రోగుల నుంచి నమూనాలను సేకరించి ఆస్ట్రియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మరో కొత్త విషయం తెలిసిందే.

కరోనా‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అతడి నుంచి మరో వ్యక్తికి సగటున 1,000 వైరస్‌ కణాలు వ్యాపిస్తాయని  గుర్తించారు. దాదాపు 750 మంది కరోనా రోగుల నుంచి శాంపిళ్లను తీసుకుని ఈ విషయాన్ని తేల్చారు. హెచ్‌ఐవీ, నోరో వైరస్‌ల కన్నా కరోనా రోగుల నుంచి వైరస్‌ కణాల వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. కరోనా సోకిన వారు మాస్క్‌ ధరించడం, ఇతరులకు భౌతిక దూరం పాటించడంతో పాటు ఇంట్లో వెంటిలేషన్‌ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అలా చేస్తే వైరస్‌ కణాల వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు.