జేఎన్యూ విద్యార్థి నేత షీలాపై సంచలన ఆరోపణలు చేసిన కన్న తండ్రి!

01-12-2020 Tue 10:03
  • జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న షీలా రషీద్
  • ఇటీవలే రూ. 3 కోట్లు అందాయన్న తండ్రి అబ్దుల్ సోరా
  • తనను హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపణలు
Abdul Sora Sensational Alegations on his Daughter Sheela Rashid

న్యూఢిల్లీలోని జేఎన్యూ (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ) విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షీలా రషీద్ పై, ఆమె కన్న తండ్రి అబ్దుల్ సోరా సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. తన కుమార్తె జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, కశ్మీర్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు విద్రోహ శక్తుల నుంచి డబ్బు జమ చేసుకుంటోందని ఆరోపిస్తూ, జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ కు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తన కుమార్తెకు చెందిన ఎస్జీవోపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తమ ఇంట్లోని సెక్యూరిటీ వారితో కలిసి తనను చంపించాలని చూస్తోందని ఈ లేఖలో ఆరోపించిన అబ్దుల్ సోరా, అందుకు భార్య, చిన్న కుమార్తె కూడా సహకరిస్తున్నారని అన్నారు. ఇటీవల ఓ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యేల నుంచి రూ. 3 కోట్లు ఆమెకు అందాయని, వాటితో దేశ వ్యతిరేక కుట్రలకు షీలా పాల్పడుతోందని ఆరోపించారు. తనను ఇంట్లోనే బంధించి చిత్ర హింసలు పెడుతున్నారని, తనను కాపాడాలని కూడా కోరారు. ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు, ఆయన చేసిన ఆరోపణలపై విచారించాలని నిర్ణయించారు.

ఇదిలావుండగా, జేఎన్యూలో విద్యార్థుల ప్రతినిధిగా తెరపైకి వచ్చిన షీలా, కేంద్రానికి వ్యతిరేకంగా పలు నిరసనల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దును ఆమె వ్యతిరేకించగా, గృహ నిర్బంధాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గతేడాది ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఇక తండ్రి చేసిన ఆరోపణలపై స్పందించిన షీలా, ఆయన్నుంచి ఇటువంటి ఆరోపణలను ఊహించలేదని, తాము ఆయన్ను ఎంతో బాగా చూసుకుంటామని వ్యాఖ్యానించడం గమనార్హం.