ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

01-12-2020 Tue 07:48
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య
  • సీపీఎం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల
  • 2013లో టీఆర్ఎస్‌లో చేరిక
  • నర్సింహయ్య మృతితో నేతల దిగ్భ్రాంతి
TRS MLA Nomula Narsimhaiah passes away

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1999, 2004లో సీపీఎం తరపున విజయం సాధించిన ఆయన 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. అంతకుముందు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భువనగరి ఎంపీ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసిన నర్సింహయ్య ఘన విజయం సాధించారు.