బాలకృష్ణ తదుపరి చిత్రానికి దర్శకుడు శ్రీవాస్?

30-11-2020 Mon 16:34
  • గతంలో బాలయ్య, శ్రీవాస్ కాంబోలో 'డిక్టేటర్'
  • ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న బాలకృష్ణ
  • కోన వెంకట్ చెప్పిన కథకు బాలయ్య ఓకే
  • బోయపాటి సినిమా తర్వాత ఇదే సెట్స్ కి     
Srivas to direct Balakrishna again

గతంలో బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'డిక్టేటర్' చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన మూడో చిత్రాన్ని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించే సినిమా ఏమై ఉంటుందనేది కొన్నాళ్లుగా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాన్ని శ్రీవాస్ తో బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇటీవల బాలకృష్ణను కలసి ఓ కథ వినిపించారట. అది బాలయ్యకు బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో దీనిని తన తదుపరి చిత్రంగా చేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలని శ్రీవాస్ కి బాలయ్య అప్పగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ ఏ బ్యానర్లో చేస్తారన్నది ఇంకా వెల్లడికాలేదు.