బీజేపీ నేతలు రోజురోజుకూ అసహనంలోకి వెళ్లిపోతున్నారు: హరీశ్ రావు

30-11-2020 Mon 16:19
  • బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • ఫేక్ న్యూస్ తో లబ్ధి పొందాలనుకుంటున్నారు
  • మతం పేరుతో ఓట్లు సాధించాలనుకుంటున్నారు
Harish Rao comments on BJP leaders

బీజేపీ నేతలకు అసహనం ఎక్కువవుతోందని.. రోజురోజుకు వారు మరింత అసహనంలోకి వెళ్లిపోతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పటాన్ చెరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రులను కూడా బీజేపీ నేతలు పిలిపించుకున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. చివరకు మోదీని కూడా హైదరాబాదుకు రప్పించారని అన్నారు. అయినప్పటికీ బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదని... దీంతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ నాలుగు ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారని... కానీ, బీజేపీ నేతలు విద్వేషాల గురించి మాట్లాడుతున్నారని, మతం పేరుతో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.