టాలీవుడ్ లో ఏడేళ్లు పూర్తిచేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్... భావోద్వేగ వ్యాఖ్యలు

29-11-2020 Sun 21:35
  • అందం, అభినయంతో రకుల్ ప్రీత్ ప్రస్థానం
  • కొద్దికాలంలోనే స్టార్ డమ్
  • అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు
Rakul Preet completes seven years in Tollywood

అటు అందం, ఇటు అభినయం పరంగా అందరినీ ఆకట్టుకుంటున్న కథానాయిక రకుల్ ప్రీత్ టాలీవుడ్ లోకి వచ్చి ఏడేళ్లయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో గుర్తింపు అందుకున్న ఈ ఉత్తరాది భామ 'లౌక్యం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత కిక్-2, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. తాను తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లయిన సందర్భంగా రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగభరితంగా స్పందించింది.

తెలుగు చిత్రసీమలో కాలుమోపిన క్షణాన ఎంత ఆనందంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే ఆనందంగా ఉన్నానని, అందుకు కారణం ఇక్కడి ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలేనని తెలిపింది. ఓ ఢిల్లీ అమ్మాయి నుంచి పక్కా తెలుగు అమ్మాయిగా తన ప్రస్థానం ఓ అందమైన అనుభూతిని మించినదని రకుల్ పేర్కొంది.

"ప్రతి దర్శకుడికి, ప్రతి నిర్మాతకు, సహనటులకు, హితులు, సన్నిహితులకు, అభిమానులకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ, అభినందించిన వారికీ, విమర్శించడం ద్వారా నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి కారణమైన వారికీ, అందరికీ కృతజ్ఞతలు. అయితే, నా కుటుంబం, మేనేజర్, నా టీమ్ లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కాదేమో" అంటూ తన పోస్టులో వివరించింది.