నేటి సాయంత్రం నుంచి డిసెంబరు 1 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్

29-11-2020 Sun 09:28
  • రాజకీయ నాయకులు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ఈసీ చర్యలు
  • నిన్నటి నుంచే నగరంలో ఊపందుకున్న మద్యం విక్రయాలు
  • చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత
Liquor shops in Hyderbad remain closed till december 1 evening

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాజకీయ నాయకులు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ఉండేందుకు అధికారులు ఈ  నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనుండడంతో నిన్నటి నుంచే నగరంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి.

అయితే, బల్క్‌గా మద్యం కొనుగోళ్లు చేయకుండా ఆబ్కారీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరైనా పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసినా, విక్రయించినా ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.