K RaghavendraRao: కెమెరా ముందుకు దర్శకేంద్రుడు.. కథానాయకుడుగా నటిస్తున్న కె.రాఘవేంద్రరావు!

  • తనికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమా 
  • దర్శకేంద్రుడి సరసన నలుగురు నాయికలు
  • రమ్యకృష్ణ, శ్రియ, సమంత ఇప్పటికే ఎంపిక
  • కీరవాణి సంగీతం.. చంద్రబోస్ పాటలు  
K Raghavendra Rao now turns hero

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాతో విడదీయరాని బంధం ఆయనది. తెలుగు కమర్షియల్ సినిమా స్థాయిని అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఘనుడు.

ఆయన సినిమాలో నటిస్తే చాలు స్టార్ స్టేటస్ వస్తుందని హీరోలు.. హీరోయిన్లు ఉవ్విళ్లూరిన చరిత్ర ఆయనది. బాక్సాఫీసు వద్ద కాసుల మోత మోగించిన నిర్దేశకుడు. అలా దశాబ్దాలుగా కెమెరా వెనకుండి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన రాఘవేంద్రరావు ఇప్పుడు.. ఈ వయసులో.. కెమెరా ముందుకు వస్తున్నారు. అది కూడా కథానాయకుడుగా!

ఆమధ్య 'మిథునం' వంటి రమణీయమైన చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో రాఘవేంద్రరావు హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్దన మహర్షి కథను అందించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చిత్రంలోని పాటలను చంద్రబోస్ రాస్తున్నారు.

ఇక ఈ సంచలన చిత్రంలో నలుగురు కథానాయికలు ఉంటారని అంటున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, శ్రియ, సమంతలను ముగ్గురు కథానాయికలుగా ఎంపిక చేశారనీ, మరో కొత్త కథానాయికను పరిచయం చేస్తారని సమాచారం. ఇందులో రమ్యకృష్ణ ఆయనకు భార్యగా నటిస్తుందట. ఏమైనా, ఈ వయసులో రాఘవేంద్రుడు హీరోగా మారడం.. దానికి భరణి దర్శకత్వం వహించడం.. అందులో నలుగురు కథానాయికలు నటించనుండడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతే అనడంలో సందేహం లేదు.  

More Telugu News