Team India: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రస్థానం ఇలా మొదలైంది... తొలి వన్డేలో ఓటమి!

  • 66 పరుగులతో ఆస్ట్రేలియా విన్
  • టీమిండియా టార్గెట్ 375 రన్స్
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు చేసిన టీమిండియా
Team India lost first ODI against Australia

కరోనా వ్యాప్తి కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన టీమిండియా ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా విసిరిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 76 బంతులాడిన పాండ్య 7 ఫోర్లు, 4 సిక్సులతో అలరించాడు.

ఓ దశలో, ధావన్ (74), పాండ్య జోడి నిలకడగా ఆడుతుండడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గినట్టుగా కనిపించినా, ధావన్ ను జంపా అవుట్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. అదే జంపా మళ్లీ పాండ్యను కూడా బుట్టలో వేశాడు. జడేజా (25), సైనీ (29 నాటౌట్), షమీ (13) పోరాడినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో చివరి వరుస బ్యాట్స్ మెన్ కి శక్తికి మించిన పనైంది. లెగ్ స్పిన్నర్ జంపా 4 వికెట్లతో భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు.

అంతకుముందు ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీశాడు. హేజెల్ వుడ్ ధాటికి మయాంక్ అగర్వాల్ (22), కెప్టెన్ విరాట్ కోహ్లీ (21), శ్రేయాస్ అయ్యర్ (2) పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114), మాజీ సారథి స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో ఆకట్టుకున్నారు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 29న సిడ్నీలోనే జరగనుంది.

More Telugu News