PennaRiver: పెన్నా నది ఉగ్రరూపం... ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్న అధికారులు

Huge flood alert for Penna river delta
  • నివర్ ప్రభావంతో ఏపీ జిల్లాల్లో వాన బీభత్సం
  • నెల్లూరు జిల్లాను వణికించిన కుండపోత వర్షాలు
  • ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ విపత్తుల శాఖ

నివర్ తుపాను పోతూపోతూ చూపించిన ప్రభావం అంతాఇంతా కాదు. బాగా బలపడిన స్థాయిలో తీరం దాటిన నివర్, భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు తుపాను స్థాయిలోనే కొనసాగడంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, తమిళనాడుకు అత్యంత సమీపంలో ఉండే నెల్లూరు జిల్లాలో నివర్ ఎఫెక్ట్ అత్యంత తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం కొనసాగడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది.

ఇప్పటికీ పెన్నా నదికి భారీ వరద వస్తుండడంతో అధికారులు పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదికి వరద పోటెత్తుతోందని, పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని హెచ్చరించారు. ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల శాఖ స్పష్టం చేసింది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, వరద నీటిలో పశువులు, గొర్రెలు, మేకలు వదలడం వంటివి చేయరాదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు.

కాగా, పైనుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో పలు చోట్ల పెన్నా నదికి కట్టలు తెగిపోయాయి. సమీప గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది.

  • Loading...

More Telugu News