అల్లు అర్జున్ సినిమాలో బోలెడు మంది విలన్లు!

27-11-2020 Fri 17:24
  • సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప'
  • ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ
  • సినిమాలో ఏకంగా తొమ్మిది మంది విలన్లు
  • హాస్య నటుడు సునీల్ కూడా విలన్ వేషమే    
Many villan roles in Allu Arjun movie

సినిమాకి హీరో ఎంత అవసరమో.. విలన్ కూడా అంతే అవసరం. అందులోనూ స్టార్ హీరోలు నటించే మాస్ సినిమాలకైతే విలన్ ప్రాధాన్యత మరీ ఉంటుంది. విలన్ ఎంత పవర్ ఫుల్ గా వుంటే హీరోయిజం అంతగానూ హైలైట్ అవుతుంది. అందుకే, మన దర్శక నిర్మాతలు స్టార్ హీరోల సినిమాల కోసం కొత్త కొత్త నటులను ఎక్కడెక్కడి నుంచో తెచ్చి, పరిచయం చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాకైతే ఒక్కరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 9 మంది విలన్లు ఉన్నారట!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలోనే తొమ్మిది మంది విలన్లు ఉన్నారట. అన్ని విలన్ పాత్రలతో ఈ చిత్రకథను సుకుమార్ కొత్తగా, పక్కాగా రూపొందించాడట. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ విలన్ల సంఖ్య గురించే చెప్పుకుంటున్నారు. ఇక ఆయా విలన్ పాత్రధారుల విషయానికి వస్తే, రావు రమేశ్, ముఖేశ్ రుషితో పాటు కమెడియన్ సునీల్ కూడా ఒక విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే మరికొందరిని ఎంపిక చేసే పనిలో యూనిట్ వుంది.

కాగా, ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో అల్లు అర్జున్ తదితరులపై ఇటీవలే కొంత షూటింగ్ చేసి, యూనిట్ హైదరాబాదుకి తిరిగొచ్చింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ స్టార్ రష్మిక కథానాయికగా నటిస్తోంది.