బ్యాంకుకు కన్నం వేసిన బాబాయ్, అబ్బాయ్... శ్మశానం పక్కన రాళ్లగుట్టలో లక్షల డబ్బు దాచిన వైనం!

27-11-2020 Fri 16:41
  • నడికుడి ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ
  • దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులకు దొరికిపోయిన వైనం
Bank robbery in Nadikudi

ఇటీవల గుంటూరు జిల్లా నడికుడిలో బ్యాంకు దొంగతనం జరిగింది. దొంగలు రూ.85 లక్షల మేర దోచుకున్నారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు కొన్నిరోజుల్లోనే ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడింది వరుసకు బాబాయ్, అబ్బాయ్ లయ్యే వినయ్ రామ, ప్రసాద్ అని గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

నల్గొండ జల్లా మిర్యాలగూడకు చెందిన కేదారి వినయ్ రామ ఇనుప స్క్రాప్ వ్యాపారం చేస్తుండగా, ప్రసాద్ ఓ టీస్టాల్ లో పనిచేస్తున్నాడు. వీరిద్దరి ప్రవృత్తి చోరీలు చేయడం. ఇదివరకే ఈ బాబాయ్, అబ్బాయ్ జోడీ ఏపీలో అనేక చోట్ల తమ 'పనితనం' ప్రదర్శించారు. ఇక, దాచేపల్లి ఏరియాలో పాత ఇనుప సామాను కొనుగోలు చేసే వినయ్ రామ... ఏకంగా బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించాడు. నడికుడి ఎస్ బీఐ బ్రాంచ్ అయితే దోపిడీకి అనుకూలంగా ఉంటుందని భావించి, తన బంధువు ప్రసాద్ తో కలిసి పలుమార్లు రెక్కీ నిర్వహించాడు.

ఈ నెల 21న గ్యాస్ కట్టర్ సాయంతో లాక్ తొలగించి బ్యాంకులో ప్రవేశించిన ఈ జోడీ లాకర్ రూమ్ లోని రూ.85 లక్షలు చోరీ చేశారు. అంత సొమ్ము తమ వద్ద ఉంటే ఇబ్బంది అని భావించి దాచేపల్లిలోని ఓ శ్మశానం పక్కనే ఉన్న రాళ్లగుట్టలో రూ.45 లక్షలు దాచారు. మిగతా సొమ్మును తమతో తీసుకెళ్లారు. అయితే, బ్యాంకులో సీసీ కెమెరాల ఫుటేజి, ఇతర ఆధారాలతో వీరిద్దరినీ పోలీసులు గుర్తించి, వారి ఇళ్లపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

కాగా, వినయ్ రామ, ప్రసాద్ బ్యాంకు దోపిడీకి వెళ్లిన సందర్భంగా తమ వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు ధరించడంతో పాటు పోలీసుల జాగిలాలను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అక్కడక్కడా కారం పొడి చల్లారు. బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం మోగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే, లాకర్ రూంలో డబ్బు కట్టలు బ్యాగులో సర్దుతుండగా, దొంగల్లో ఒకరి జేబు నుంచి ఫోన్ నెంబరు రాసి ఉన్న స్లిప్ కిందపడింది. ఇదే బాబాయ్, అబ్బాయ్ లను పట్టించింది. ఆ ఫోన్ నెంబరు స్లిప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ నెంబరుకు కాల్ చేయడంతో దొంగలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు దొరికిపోయారు.