డిసెంబరు 4 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

27-11-2020 Fri 09:14
  • థియేటర్లను తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతున్న యజమానులు
  • ప్రోత్సాహకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • పాత సినిమాలు వేస్తే ఎవరు చూస్తారంటున్న యజమానులు
Movie theaters are set to reopen in Telangana from december 4th

కొవిడ్ కారణంగా తెలంగాణలో  మూతపడిన సినిమా థియేటర్లు వచ్చే నెల 4 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అదే రోజున ఓ ఇంగ్లిష్ సినిమా విడుదల కానుండడంతో సినిమా హాళ్లను తిరిగి తెరవాలని వాటి యజమానులు నిర్ణయించారు. మల్టీ‌ప్లెక్స్‌లు కూడా అదే రోజు తెరుచుకోనున్నాయి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లను తిరిగి తెరవవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంతో థియేటర్ యజమానులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, నాలుగు షోలే కాకుండా ఎక్కువ ఆటలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ల ధరలను పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యజమానులు ఆ దిశగానూ కసరత్తు ప్రారంభించారు. కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో పాత సినిమాలు వేస్తే థియేటర్లకు ఎవరూ రారని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్ పేర్కొన్నారు.

థియేటర్‌ను ఎప్పుడు తెరవాలనే దానిపై తాము ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. డిసెంబరు 4, లేదంటే 11 నుంచి సినిమా హాళ్లను తెరిచే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యజమానుల చేతిలోనే వున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు వచ్చే నెల 4న తెరుచుకుంటాయన్నారు. లీజులో ఉన్న థియేటర్లు మాత్రం పెద్ద సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.