తిరుపతి సమీపంలో వాయుగుండం.. దక్షిణ ఏపీ జిల్లాలకు భారీ వర్ష సూచన

27-11-2020 Fri 08:46
  • తిరుపతి, నెల్లూరు మధ్యలో వాయుగుండం
  • గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
Heavy rains to hit South AP

నివర్ తుపాను ప్రభావంతో ఇప్పటికే దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంట నాశనమైపోయిందని రైతులు కంటతడి పెడుతున్నారు. మరోవైపు తిరుపతి సమీపంలో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది.

తిరుపతికి ఉత్తర దిశగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.