మంజీర నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఏవో అరుణ

27-11-2020 Fri 07:37
  • సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వస్తుండగా ఘటన
  • రాయిపల్లి వద్ద కారు దిగి వంతెన పైనుంచి నదిలోకి దూకిన ఏవో
  • ఆత్మహత్యకు ముందు సోదరుడి వరసైన వ్యక్తికి ఫోన్
agriculture officer attempts suicide in manjeera river in sangareddy

సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రంలో ఆగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో)గా పనిచేస్తున్న అరుణ (34) నిన్న సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు కారులో వస్తూ మనూరు మండలం రాయిపల్లి వద్ద దిగి అకస్మాత్తుగా వంతెన పైనుంచి మంజీర నదిలోకి దూకడం కలకలం రేపింది. నదిలో దూకడానికి ముందు వరుసకు తమ్ముడైన పవన్‌కు ఫోన్ చేసి, మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పారు. కంగారు పడిన అతడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అందరూ కలిసి వంతెన వద్దకు చేరుకున్నారు.

అక్కడ ఆమె ప్రయాణించిన కారు, హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరుణ కోసం గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అరుణకు 2016లో మోర్గికి చెందిన శివశంకర్‌తో వివాహమైంది. వీరికి రుద్రవీర్ అనే మూడేళ్ల కుమారుడు, 11 నెలల చిన్నారి విరాట్ ఉన్నారు. కాగా, అరుణ గతంలో మనూరు, నారాయణ‌ఖేడ్ కల్హేర్ ఏవోగా పనిచేశారు.