జగనన్న తోడు పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోము వీర్రాజు

26-11-2020 Thu 21:21
  • కేంద్ర ప్రభుత్వ పథకాన్నే జగనన్న తోడు పథకంగా ప్రవేశ పెట్టారు
  • కనీసం మోదీ ఫొటో కూడా పెట్టలేదు
  • పథకం పేరును ఉపసంహరించుకోండి
Somu Veerraju objects Jagananna Thodu scheme

ఏపీ ప్రభుత్వం 'జగనన్న తోడు' పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తోపుడు బండ్లు, ఫుట్ పాత్ ల వంటి వాటిపై చిరు వ్యాపారాలను చేసుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్కొక్కరికి రూ. 10 వేల వంతున వడ్డీ లేని రుణాలను ఈ పథకం ద్వారా ఇవ్వనున్నారు.

అయితే, ఈ పథకంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్నే జగనన్న తోడు పథకంగా ప్రకటించారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.

పథకంపై కనీసం ప్రధాని మోదీ ఫొటోను కూడా పెట్టలేదని వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. జగనన్న తోడు అనే పేరును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకుంటున్నప్పుడు కచ్చితంగా ప్రధాని ఫొటోను ఉంచాలని చెప్పారు.