అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చంద్రబాబు

26-11-2020 Thu 20:24
  • పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేయాలన్న అక్బర్
  • రాజకీయాల కోసం మహనీయులను రచ్చకీడుస్తారా? అన్న చంద్రబాబు
  • పీవీ, ఎన్టీఆర్ తెలుగు వెలుగులు అన్న బాబు
Chandrababu condemns Akbaruddin Owaisi comments

దివంగత పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేయాలంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

'తెలుగువారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావులు. దేశంలో పేదల సంక్షేమానికి బాటలు వేసింది ఎన్టీఆర్ అయితే... ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ.

ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసు. అటువంటి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.

నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమే' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.