మధ్యలో ఆగిపోయిన కీర్తి సురేశ్ తొలి సినిమా.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి!

25-11-2020 Wed 11:24
  • 'మహానటి'తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కీర్తి
  • ఆగిపోయిన తొలి సినిమా 'ఐనా ఇష్టం నువ్వు'
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిర్వహణ
  • 'రెండు జళ్ల సీత'గా టైటిల్ మార్పు  
Keerti Suresh maiden film coming soon

'మహానటి' సినిమాతో ఒక్కసారిగా మంచి నటిగా పేరుతెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్. ఆ తర్వాత నుంచి ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది. ఇదిలావుంచితే, ఆమె కథానాయికగా నటించగా విడుదలైన తొలి చిత్రం మాత్రం రామ్ హీరోగా నటించిన 'నేను శైలజ'.

విచిత్రం ఏమిటంటే, ఈ చిత్రానికంటే ముందే ఆమె తెలుగులో ఓ చిత్రం చేసింది. ఈ సినిమా పేరు 'ఐనా ఇష్టం నువ్వు..'. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ కృష్ణ ఇందులో హీరోగా నటించాడు. నూతన దర్శకుడు రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చంటి అడ్డాల నిర్మాత. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కారణాంతరాల వల్ల ఆగిపోయింది.

ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, చిత్రం పేరును 'రెండు జళ్ల సీత'గా మార్చి నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలవుతుంది.