Toyota: ఆగిన టయోటా కార్ల ఉత్పత్తి!

  • కార్మికుల్లో అత్యధికులు సమ్మెలో
  • నవంబర్ 10న బిడాడి ప్లాంట్ మూసివేత
  • అమ్మకాలపై ప్రభావం ఉంటుందన్న టయోటా
Car Production Halted in Toyota Plants

తమ కార్ల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు సమ్మెలో ఉండటంతో సోమవారం నుంచి కార్ల తయారీ నిలిచిపోయిందని టయోటా మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. కర్ణాటకలోని బిడాడిలోని ప్లాంటు నవంబర్ 10న మూత పడిందని, ఆపై చెన్నైలోని ప్లాంటులోనూ పనులు నిలిచి పోయాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ వెల్లడించింది.

ఇటీవల సంస్థలోని ఓ కార్మికుడిని విధుల నుంచి తొలగించడంతో మిగతా ఉద్యోగులంతా సమ్మెకు దిగారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సమ్మె వ్యతిరేకమని, ఇది చట్ట విరుద్ధమని వెల్లడించినప్పటికీ, ఇంకా ఉత్పత్తి తిరిగి ప్రారంభం కాలేదని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, సమ్మె ప్రారంభమైన తరువాత టయోటా కిర్లోస్కర్ మోటార్స్ లాకౌట్ ను ప్రకటించి, ఆపై దాన్ని తొలగించినా కేవలం అతి కొద్ది మంది మాత్రమే విధుల్లోకి వచ్చారు.

కాగా, సంస్థలో కార్ల తయారీ సజావుగా నడవాలంటే, ప్రతి షిఫ్ట్ లోనూ కనీసం 90 శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సివుంటుందని కానీ, అంతమంది కార్మికులు హాజరు కావడం లేదని, దాంతోనే పనులు నిలిచిపోయాయని సంస్థ అధికారులు పేర్కొన్నారు. కార్ల తయారీ నిలిచిన ప్రభావం, తదుపరి నెల అమ్మకాలపై పడుతుందని, ఇండియాలో పండగ సీజన్ కొనసాగుతున్న వేళ సంస్థ నష్టాలకు ఇది కారణం అవుతుందని సంస్థ ఆందోళన చెందుతోంది.

More Telugu News