IMA: సర్జరీలకు ఆయుర్వేదమా?... ఇది 'కిచడిఫికేషన్': ఇండియన్ మెడికల్ అసోసియేషన్

  • ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు ఆపరేషన్స్ లో చికిత్స
  • ప్రతిపాదించిన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్
  • తీవ్రంగా ఖండించిన ఐఎంఏ
Ayurveda Surgeries is KICHADIFICATION says IMA

పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు శిక్షణ ఇప్పించాలంటూ సీసీఐఎం (సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్) తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నిర్ణయం వైద్య విద్య, ప్రాక్టీస్ లో 'కిచడిఫికేషన్' (అయోమయపు సమ్మేళనం) వంటిదని అభివర్ణించింది.

నవంబర్ 20న ఆయుష్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సీసీఐఎం ఇచ్చిన నోటిఫికేషన్ లో భారత ఔషధ వ్యవస్థను నియంత్రించాల్సిన అవసరం ఉందని, 29 రకాల సాధారణ సర్జరీలు, 19 రకాల చెవులు, కళ్లు, ముక్కు, గొంతుకు సంబంధించిన శస్త్రచికిత్సలను పీజీ ఆయుర్వేద విద్యలో కలుపుతూ చట్ట సవరణకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఆపై ఐఎంఏ స్పందిస్తూ, ఇటువంటి నిర్ణయాలు తగవని హితవు పలికింది. అధునాత వైద్య విద్యలో శల్య తంత్ర, శాలక్య తంత్ర శస్త్రచికిత్సలు పనికిరావని పేర్కొంది. ఆ వెంటనే ఆయుష్ మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ, ఈ నోటిఫికేషన్ లో వాడిన సాంకేతిక పదాలు, ఆధునిక పరిణామాలు మానవజాతి యొక్క సాధారణ వారసత్వానికి సంబంధించినవేనని పేర్కొంది.అయితే, ఈ వివరణను స్వీకరించేందుకు ఐఎంఏ నిరాకరించడం గమనార్హం. ఇండియాలో ఆధునిక వైద్య శాస్త్రాన్ని సీసీఐఎం ఆక్రమించాలని చూస్తోందని ఆరోపించింది.

సీసీఐఎం సవరణలను ఒంటరిగా చూడలేమని, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సంరక్షణ విషయంలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రసిద్ధ వైద్యులతో ఇండియా పోటీపడుతున్న వేళ, అటువంటి వారసత్వాన్ని కోల్పోవడంలో అర్థం ఏముందని ఆయన ప్రశ్నించారు.

More Telugu News