అమెరికా విదేశాంగ మంత్రిగా బ్లింకెన్ ఎంపిక చైనా, పాకిస్థాన్ లకు చేదు వార్తేనా?

24-11-2020 Tue 14:13
  • మొదటి నుంచి ఇండియాకు అనుకూలంగా ఉన్న బ్లింకెన్
  • అమెరికాకు ప్రాధాన్యత కలిగిన రక్షణ భాగస్వామి ఇండియా అన్న బ్లింకెన్
  • భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఉండాలని వ్యాఖ్య
  • ఇండియాతో బంధాలను మరింత పెంచుకోవాలన్న బ్లింకెన్
  • చైనా, పాక్ లకు వ్యతిరేకంగా అభిప్రాయాల వెల్లడి
Why Blinkens appointment as US Secretary of State is bad news for Pakistan and China

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ జనవరి 20న బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు సహచరులుగా ఉన్న పలువురిని కేబినెట్లోకి తీసుకున్నారు. అత్యంత కీలకమైన విదేశాంగశాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్ ను ప్రకటించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్లింకెన్ విదేశాంగశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. మరోవైపు బ్లింకెన్ విదేశాంగశాఖ మంత్రి కావడం ఇండియాకు గుడ్ న్యూస్ అని... చైనా, పాకిస్థాన్ లకు చేదు వార్త అని విశ్లేషకులు చెపుతున్నారు. వారు ఈ మాట చెప్పడానికి కారణాలేంటో చూద్దాం.

గత జూలై 9న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్లింకెన్ మాట్లాడుతూ, ఇండియాతో ఉన్న బంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భవిష్యత్తు దృష్ట్యా ఇండియాతో బంధం చాలా ముఖ్యమని అన్నారు. క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా-బైడెన్ పాలనలో భారత్ తో అనుబంధానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు.

బుష్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇండియాతో జరిగిన శాంతియుత అణు సహకార ఒప్పందం వెనుక అప్పటి సెనేటర్ బైడెన్ కూడా ఉన్నారని బ్లింకెన్ అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండియాను ఒక మేజర్ డిఫెన్స్ పార్ట్ నర్ గా చూశారని చెప్పారు. ఒబామా-బైడెన్ పాలనలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీల ప్రభుత్వాలతో అన్ని రంగాలలో బంధాలను బలోపేతం చేసుకున్నామని తెలిపారు. రక్షణ, వాణిజ్య రంగాలలో బంధాలు ఎంతో బలపడ్డాయని చెప్పారు. అమెరికా-ఇండియా కంపెనీలు కలిసి పనిచేసేందుకు అది దోహదపడిందని తెలిపారు. అమెరికాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన రక్షణ భాగస్వామిగా ఇండియాను తాము చేశామని చెప్పారు.

గత ఆగస్ట్ 15న ఇండో-యూఎస్ సంబంధాలపై ఒక ప్యానల్ మీటింగ్ లో బ్లింకెన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థలలో ఇండియా మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లభించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.

ఇదే మీటింగ్ లో చైనాపై బ్లింకెన్ విమర్శలు గుప్పించారు. చైనాతో అమెరికాకు, ఇండియాకు దాదాపు ఒకే విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఇండియా విషయంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చైనా ఆర్థిక విధానాలు ఇతర దేశాలకు నష్టం కలిగించేలా ఉన్నాయని దుయ్యబట్టారు. బైడెన్ ప్రభుత్వం వస్తే ఇండియా వంటి కీలక భాగస్వాములతో కలసి చైనాను ఎదుర్కొంటామని చెప్పారు. ఇండియాతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడతామని  తెలిపారు.

టెర్రరిజంపై బ్లింకెన్ మాట్లాడుతూ... ఇండియా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. టెర్రరిజంను ఇండియా ఎదుర్కొనే విషయంలో కూడా సహకరిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, బ్లింకెన్ యూఎస్ విదేశాంగ మంత్రి అయితే ఇండియాకు ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెపుతున్నారు. బ్లింకెన్ విదేశాంగ మంత్రి కావడం చైనా, పాకిస్థాన్ లకు రుచించదని అంటున్నారు.