శత్రుదుర్భేద్యమైన 'ఎయిరిండియా వన్' లో తొలి ప్రయాణం రాష్ట్రపతిదే!

24-11-2020 Tue 13:40
  • ప్రభుత్వ పెద్దల ప్రయాణాల కోసం అధునాతన విమానం
  • ఇటీవలే బోయింగ్ సంస్థ నుంచి ఎయిరిండియా వన్ విమానాలు
  • ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన రాష్ట్రపతి
President Ramnath Kovind became the first to traveled in Airindia One

అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం అత్యున్నత భద్రతా ఏర్పాట్లతో కూడిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. భారత్ కూడా ఇటీవల అలాంటి విమానాలనే బోయింగ్ సంస్థ నుంచి అందుకుంది. ఈ బోయింగ్ 777-300 ఈఆర్ విమానంలో మొట్టమొదట అధికారిక ప్రయాణం చేసిన ఘనత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు దక్కింది. ఆయన ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు.

అందుకోసం ఢిల్లీ నుంచి ఈ 'ఎయిరిండియా వన్' విమానంలో బయల్దేరిన ఆయన చెన్నై చేరుకున్నారు. చెన్నై నుంచి భారత వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఈ విమానంలో తొలిసారి ప్రయాణిస్తుండడంతో, తమ ప్రయాణానికి ముందు రాష్ట్రపతి దంపతులు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.

కాగా, 'ఎయిరిండియా వన్' విమానం కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాలకే వినియోగిస్తారు. ఇలాంటిదే మరో విమానాన్ని విదేశీ ప్రముఖులు భారత్ వచ్చినప్పుడు వారికోసం వినియోగిస్తారు. ఈ 'ఎయిరిండియా వన్' విమానంలో ప్రత్యేకతలు వింటే ఔరా అంటారు. ఇందులో ప్రయాణ సదుపాయాలే కాదు, ఓ యుద్ధంలో పాల్గొనేంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలు పొందుపరిచారు. మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు (ఎండీఎస్), ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ జామర్లు, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి.

ఇందులోని అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు శత్రు దేశాల రాడార్లను స్తంభింపచేస్తాయి. దీంట్లోని ఇన్ ఫ్రారెడ్ సిగ్నలింగ్ వ్యవస్థలు శత్రుదేశాల క్షిపణులను తప్పుదోవ పట్టించగలవు. ఈ విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. రెండు జీఈ90-115 ఇంజిన్లతో దీన్ని పరిపుష్టం చేశారు. 'ఎయిరిండియా వన్' విమానం గాల్లోనే ఇంధనం నింపుకోగలదు. దీని ఖరీదు సుమారు రూ.8,400 కోట్లు.