కొంచెం ఆలస్యమైనా చిత్ర పరిశ్రమకు దీపావళి కానుక ఇచ్చారు!: సీఎం కేసీఆర్ పై నాగబాబు ప్రశంసలు

23-11-2020 Mon 22:05
  • సినిమాహాళ్ల రీఓపెనింగుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
  • చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూరేలా ఊరట కలిగించే చర్యలు
  • కేసీఆర్ నిర్ణయాల పట్ల చిత్రసీమలో సంతోషం
  • సీఎంపై కృతజ్ఞతల వెల్లువ
Mega Brother Nagababu comments on CM KCR decision

గత కొన్నిరోజులుగా అనిశ్చితి నెలకొన్న తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్, చిత్ర పరిశ్రమకు లాభం చేకూర్చే ఉపశమన చర్యల పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మెగాబ్రదర్ నాగబాబు కూడా చేరారు.

పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సినీ పరిశ్రమ అభివృద్ధి ప్రణాళిక అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటోందని నాగబాబు తెలిపారు. ఇన్నాళ్లు వినోదం కోసం అందరికీ ఆసరాగా నిలిచిన సినీ పరిశ్రమకు ఎవరూ ఆసరాగా నిలవలేకపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని, కానీ సీఎం కేసీఆర్ ఇస్తున్న అండ ఎంతోమందికి ఆసరా, మరెంతో మందికి ప్రేరణ ఇస్తుందని కొనియాడారు.

బతుకుదెరువు కోసం దిక్కుతోచని స్థితిలో నిలిచిన 40 వేల మంది సినీ కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేసి తానే దిక్కులా నిలిచి వారి కన్నీళ్లు తుడిచేందుకు దోహదపడుతున్నారని సీఎం కేసీఆర్ పై నాగబాబు ప్రశంసలు జల్లు కురిపించారు. జీఎస్టీలో రాయితీలు ఇస్తూ నిర్మాతలకు సాయపడడం ద్వారా మరెన్నో సినిమాల నిర్మాణానికి నాంది పలుకుతున్నారని వెల్లడించారు.

సినిమా షోల సంఖ్య పెంచుకునే అవకాశం ఇవ్వడం, టికెట్ రేట్లను సవరించుకునేందుకు అనుమతించడం, సినిమా హాళ్లకు సంబంధించి ఆర్నెల్ల విద్యుత్ బిల్లులు మాఫీ చేయడం ద్వారా సినీ ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం నింపారంటూ సీఎం కేసీఆర్ ను ఈ మెగాబ్రదర్ వేనోళ్ల పొగిడారు. కొంచెం ఆలస్యమైనా సరే మీరు పరిశ్రమకు దీపావళి కానుక ఇచ్చారని, అందుకు మరొక్కమారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నాగబాబు ఓ ప్రకటన చేశారు.