Maharashtra: ఢిల్లీకి రాకపోకలను నిలిపివేసే అంశంపై ఆలోచిస్తున్న మహారాష్ట్ర

Decision In 8 Days On Flights and Trains To Delhi says Maharashtra
  • ఢిల్లీ, గుజరాత్ లలో పెరుగుతున్న కరోనా కేసులు
  • 8 రోజుల్లో రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి  
  • గుజరాత్ లాక్ డౌన్ విధిస్తే ఆటోమేటిక్ గా రాకపోకలు నిలిచిపోతాయని వ్యాఖ్య
కరోనా సెకండ్ వేవ్ ఒక సునామీలా వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇప్పటికే హెచ్చరించిన సంగతి  తెలిసిందే. మరోవైపు ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి విజయ్ వద్దేతివార్ సంచలన విషయాన్ని వెల్లడించారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో... ఢిల్లీకి విమాన, రైలు, రోడ్డు మార్గాల రాకపోకలను నిషేధించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఎనిమిది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నవంబర్ 30 వరకు లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని... అందువల్ల అప్పటి వరకు ఢిల్లీకి రాకపోకలపై నిషేధాన్ని విధించబోమని చెప్పారు.

ఢిల్లీతో పాటు గుజరాత్ లో కరోనా పరిస్థితిని కూడా తాము పరిశీలిస్తున్నామని విజయ్ చెప్పారు. ఒకవేళ గుజరాత్ లో లాక్ డౌన్ విధిస్తే... అక్కడి నుంచి మహారాష్ట్రకు ఆటోమేటిక్ గా రాకపోకలు నిలిచిపోతాయని అన్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గుజరాత్ తో పాటు మరో మూడు రాష్ట్రాలకు కేంద్రం హైలెవెల్ టీములను పంపింది. మరోవైపు ఈ నాలుగు రాష్ట్రాలు కరోనా పరిస్థితిపై పూర్తి నివేదికను అందజేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. రాష్ట్రాలు సర్వ సన్నద్ధంగా ఉండకపోతే డిసెంబర్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని సుప్రీం హెచ్చరించింది.
Maharashtra
Gujarath
Delhi
Corona Virus

More Telugu News