ఎవరి నాయకత్వంలోనైనా సరే అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం... బైడెన్ గెలుపును మాత్రం గుర్తించలేం: పుతిన్

22-11-2020 Sun 20:41
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కు మెజారిటీ
  • అభినందించిన అనేక దేశాలు
  • ఆచితూచి స్పందిస్తున్న రష్యా
Russian president Vladimir Putin says they can not recognize Biden victory

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన జో బైడెన్ కు ప్రపంచదేశాలు శుభాకాంక్షలు పలికినా, చైనా, రష్యా వంటి కొన్నిదేశాలు వేచిచూసే ధోరణి అవలంబించాయి. చైనా ఇటీవలే బైడెన్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించగా, రష్యా తాజాగా స్పందించింది.

ఎవరి నాయకత్వంలోనైనా సరే అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రస్తుతం బైడెన్ విజయాన్ని గుర్తించలేమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ వైఖరిని స్పష్టం చేశారు. బైడెన్ గెలిచాడన్న విషయాన్ని అమెరికాలో చట్టబద్ధంగా ప్రకటించాల్సి ఉందని, బైడెన్ విజేత అని ఆయన ప్రత్యర్థి పక్షం కూడా గుర్తించాల్సి ఉందని పుతిన్ అభిప్రాయపడ్డారు. అంతేతప్ప, బైడెన్ ను అభినందించకపోవడం వెనుక ఎలాంటి వ్యూహాత్మక విధానం లేదని అన్నారు.

కాగా, బైడెన్ గెలుపు పట్ల రష్యా స్పందించకపోవడం వల్ల ఇరు దేశాల సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, 'కొత్తగా దెబ్బతినడానికి ఏముంది? రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడో క్షీణించాయి' అని జవాబిచ్చారు.

2016 ఎన్నికల్లో ట్రంప్ విజయానికి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రష్యా తోడ్పాటు అందించిందని ఆరోపణలు రావడం తెలిసిందే. అందుకేనేమో, ఈసారి అమెరికా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కనీసం స్పందించడానికి కూడా రష్యా ఇష్టపడడంలేదు.