Zaira Wasim: ఇంటర్నెట్లో ఇకపై తన ఫొటోలు షేర్ చేయొద్దన్న 'దంగల్' నటి

Dangal fame Zaira Wasim urges fans do not share her photos any more
  • దంగల్ తో పాప్యులారిటీ సంపాదించుకున్న జైరా వాసిమ్
  • రెండేళ్లకే సినిమాల నుంచి తప్పుకున్న వైనం
  • తన జీవితంలో కొత్త అధ్యాయం అంటూ తాజాగా ప్రకటన
దంగల్ సినిమాతో ఆలిండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి... జైరా వాసిమ్. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె కెరీర్ ఉజ్వలంగా సాగిపోతుందని భావించారు. అయితే, దంగల్ విడుదలైన రెండేళ్లకే దిగ్భ్రాంతి కలిగిస్తూ ఆమె సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు అప్పట్లో ప్రకటించింది.

సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టులు చేస్తుండే జైరా... కొంతకాలం కిందట నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దేశంలో పంట పొలాలపై మిడతలు దాడి చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలు మానవ తప్పిదాల కారణంగానే జరుగుతాయని ఖురాన్ లో చెప్పారని పేర్కొంది. మత ప్రస్తావన తీసుకువచ్చిందంటూ ఆమెపై భారీగా ట్రోలింగ్ జరిగింది. దాంతో జైరా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తాత్కాలికంగా తప్పుకుంది.

అయితే, తాజాగా ఓ పోస్టు చేస్తూ, ఇకపై ఇంటర్నెట్లో తన ఫొటోలు ఎవరూ షేర్ చేయొద్దని స్పష్టం చేసింది. తనపై ప్రేమను చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంటర్నెట్ లో ఇప్పటివరకు ఉన్న తన ఫొటోలన్నీ తొలగించడం వీలయ్యే పనికాదని, ఇకపై మాత్రం ఎవరూ కొత్తగా ఫొటోలు షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నానని, అభిమానులు చేసే ఈ సాయం వల్ల తనకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నానని తెలిపింది. తన ఫొటోలు వాడొద్దని ఏడాదిగా ఫ్యాన్ పేజీల వాళ్లకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని, తన తాజా విజ్ఞప్తినైనా వారు పరిగణనలోకి తీసుకోవాలని జైరా కోరింది.
Zaira Wasim
Photos
Fans
Internet
Dangal

More Telugu News