ఎట్టకేలకు చదువుల తల్లికి ఎయిమ్స్ లో సీటు!

21-11-2020 Sat 16:37
  • కేరళకు చెందిన ఫర్హీన్ కు నీట్ లో 66వ ర్యాంకు
  • క్రీమీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో సీటు నిరాకరించిన ఎయిమ్స్
  • కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ఆల్ఫోన్స్
NEET ranker KS Farheen get her admission in AIIMS

జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో 66వ ర్యాంకు పొందిన ఓ విద్యార్థినికి సీటు నిరాకరించిన ఎయిమ్స్ ఆపై తన తప్పు దిద్దుకుంది. కేరళకు చెందిన కేఎస్ ఫర్హీన్ అనే విద్యార్థిని నీట్-2020లో మెరుగైన ర్యాంకు సాధించి టాప్-100లో నిలిచింది.  నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె వైద్య విద్య కోసం ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో దరఖాస్తు చేసుకుంది.

అయితే గడువు లోపల క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో ఎయిమ్స్ యాజమాన్యం సీటు నిరాకరించింది. దాంతో ఆమె బీజేపీ ఎంపీ ఆల్ఫోన్స్ ను కలిసి తన పరిస్థితి వివరించింది. దాంతో ఎంపీ ఆల్ఫోన్స్ ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రి వెంటనే స్పందించి ఎయిమ్స్ ను ఆదేశించారు. మెరుగైన ర్యాంకర్ కు సీటు ఇవ్వకపోవడాన్ని తమ తప్పిదంగా భావించిన ఎయిమ్స్ యాజమాన్యం వెంటనే ఫర్హీన్ కు వైద్య విద్యలో అడ్మిషన్ ఇచ్చింది.

దీనిపై ఎంపీ ఆల్ఫోన్స్ స్పందిస్తూ, ఓ విద్యాసంస్థకు చెందిన విధివిధానాలను వారి ప్రాస్పెక్టస్ లోనే స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ప్రతి విద్యార్థీ ఢిల్లీ వచ్చి కేంద్రమంత్రులను కలవలేరని, అందుకే ఓ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎదురయ్యే ఇబ్బందులను ఈ అప్పిలేట్ అథారిటీ పరిష్కరించే విధంగా ఉండాలని వివరించారు.