బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 'హెల్త్ కేర్ లీడర్ షిప్' అవార్డు... హర్షం వ్యక్తం చేసిన లోకేశ్

20-11-2020 Fri 20:46
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • ఆసుపత్రి సిబ్బంది కృషిని అభినందించిన వైనం
  • మరింత మెరుగైన సేవలు అందించాలంటూ ఆకాంక్ష
Nara Lokesh appreciates Basavatarakam Cancer Hospital staff

హైదరాబాదులో ఉన్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి కొన్ని వేలమందికి విశేషమైన సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో బసవతారకం ఆసుపత్రికి 'హెల్త్ కేర్ లీడర్ షిప్ అవార్డు 2020' లభించింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించడం ఆనందదాయకం అని పేర్కొన్నారు.

ఈ అవార్డు రావడానికి కారణమైన సంస్థ సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావుకు, అంకితభావంతో సేవలు అందిస్తున్న వైద్యులకు, ఇతర సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నానని లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పడంలో తాత ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ప్రజలకు ఇలాగే మెరుగైన వైద్య సేవలను అందిస్తూ, సంస్థ ప్రతిష్ఠను మరింత ఎత్తున నిలిపేందుకు మీరంతా కృషి చేస్తారని ఆశిస్తున్నానని ఆసుపత్రి వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.