పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్... నదీమ తల్లికి సారె సమర్పణ

20-11-2020 Fri 14:16
  • నేటి నుంచి డిసెంబరు 1 వరకు పుష్కరాలు
  • సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద నదీమతల్లికి సీఎం పూజలు
  • 2008లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన వైఎస్సార్
CM Jagan inaugurates Thungabhadra Pushkaralu

పన్నెండేళ్లకోసారి వచ్చే పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. కర్నూలు సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద వేదమంత్రాల నడుమ ఆయన నదీమ తల్లికి పుష్కర ప్రారంభ క్రతువు నిర్వహించారు. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడన్న ముహూర్త ఘడియలు పాటిస్తూ సీఎం జగన్ తుంగభద్రమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు-కుంకుమ, సారే సమర్పించి ఆపై హారతి ఇచ్చారు. హోమంలోనూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పుష్కరాల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. తుంగభద్ర పుష్కరాలు నేటి నుంచి డిసెంబరు 1 వరకు జరగనున్నాయి.

కాగా, గతంలో సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కర్నూలు సంకల్ భాగ్ ఘాట్ నుంచే తుంగభద్ర పుష్కరాలకు ప్రారంభోత్సవం చేశారు. 2008లో వైఎస్సార్ ప్రారంభోత్సవం చేయగా, ఆ తర్వాతి పుష్కరాలకు నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేయడం విశేషం.