Bandi Sanjay: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్న బండి సంజయ్.. మిన్నంటిన 'జై శ్రీరాం' నినాదాలు

  • తన సంతకాన్ని టీఆర్ఎస్ ఫోర్జరీ చేసిందన్న సంజయ్
  • అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని కేసీఆర్ కు సవాల్
  • చార్మినార్ వద్ద భారీ భద్రత
Bandi Sanjay reaches Charminar Bhagyalakshmi Temple

సవాల్ విసిరినట్టే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయం వద్ద నుంచి ఆయన చార్మినార్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంటన పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. చార్మినార్ వద్దకు బండి సంజయ్ చేరుకోగానే అక్కడ 'జై శ్రీరాం' అనే నినాదాలు మిన్నంటాయి.

చార్మినార్ కు చేరుకున్న బండి సంజయ్ నేరుగా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆయనకు అమ్మవారి రక్షణ వస్త్రాన్ని కప్పి, పూలమాల వేసి పూజలు నిర్వహించారు. మరోవైపు సంజయ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఆయన ప్రయాణాన్ని వీడియోలతో చిత్రీకరించారు. చార్మినార్ వద్ద కూడా అన్ని మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు శుక్రవారం కావడంతో పాతబస్తీలో పరిస్థితి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉంటుంది. దీంతో, పోలీసులు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

వరద సాయాన్ని ఆపేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ ముఖ్యమంత్రి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు సంజయ్ సవాల్ విసిరారు. ఈరోజు మధ్యాహ్నం తాను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వస్తానని... ఆ లేఖ తాను రాయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ప్రమాణం చేస్తానని అన్నారు. కేసీఆర్ కూడా వచ్చి తన సంతకాన్ని టీఆర్ఎస్ ఫోర్జరీ చేసిందో, లేదో అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పాలని ఛాలెంజ్ చేశారు.

More Telugu News