బీజేపీలో చేరుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: అంజన్ కుమార్ యాదవ్

19-11-2020 Thu 14:57
  • గ్రేటర్ ఎన్నికలలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు
  • అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా
  • కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే లేదు
Iam not leaving Congress party says Anjan Kumar Yadav

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఇంకా చేరబోతున్నారంటూ పలువురు కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

 ఈ వార్తలపై అంజన్ కుమార్ యాదవ్ స్పందిస్తూ, కావాలనే కొంత మంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని... అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.