‘గ్రేటర్’ ఫైట్: కళకళలాడిన ఎన్డీఆర్ భవన్.. నేడు టీడీపీ తొలి జాబితా విడుదల

19-11-2020 Thu 09:57
  • అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బరిలోకి దిగాలని నిర్ణయం
  • ఒక్కో డివిజన్‌కు రెండు నుంచి ఐదు దరఖాస్తులు
  • రెండో జాబితా కూడా నేడే
TDP Release first list for GHMC Elections

జీహెచ్ఎంసీ ఎన్నికలతో తిరిగి పుంజుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థుల కోసం వడపోత ప్రారంభించింది. అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ డివిజన్‌లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఆశావహులతో నిన్న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కళకళలాడింది. ఊహించని రీతిలో స్పందన వస్తోందని, ఒక్కో డివిజన్‌కు రెండు నుంచి ఐదు వరకు దరఖాస్తులు వచ్చాయని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఎల్.రమణ తెలిపారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేస్తామన్నారు.

అలాగే, రాత్రికి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సమావేశానికి రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటాలని కంభంపాటి అన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాను అన్ని డివిజన్లలో పర్యటించానని, మంచి స్పందన వచ్చిందని అరవింద్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.