గ్రేటర్ పోరు... హైదరాబాదీలు తప్పక పాటించాల్సిన నిబంధనలివి!

19-11-2020 Thu 09:38
  • కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు
  • మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి
  • నామినేషన్ వేసేందుకు వెళ్లే అభ్యర్థితో పాటు మరొకరు మాత్రమే
  • ప్రచార సభలు విశాల ప్రాంగణాల్లోనే
  • ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం
GMHC Election Rules

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ఎన్నికల కమిషన్ ఓటర్లు తప్పకుండా పాటించాల్సిన నిబంధనలపై కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అభ్యర్థుల నామినేషన్ల నుంచి వాటి పరిశీలన, సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపు, లెక్కింపు వరకూ పలు నిబంధనలను విధించింది. వాటిని పరిశీలిస్తే...

నామినేషన్ వేసేందుకు కేవలం రెండు వాహనాల్లో మాత్రమే రావాల్సి వుంటుంది. ఆపై, అభ్యర్థుల ప్రచారం సమయంలో భద్రతా సిబ్బందిని మినహాయిస్తే, ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉండేందుకు వీల్లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ ప్రచార సభలను విశాలమైన హాల్స్ లో కెపాసిటీలో సగం మందికి మాత్రమే అనుమతిస్తూ నిర్వహించుకోవాలి. అక్కడ కూడా శానిటైజర్, మాస్క్ తప్పనిసరి.

ఇక రిటర్నింగ్ అధికారి చాంబర్ లో సైతం భౌతిక దూరం నిబంధనలు అమలవుతాయి. చిహ్నాల కేటాయింపు కూడా విశాలమైన ప్రదేశంలో చేయాల్సి వుంటుంది. నామినేషన్ దాఖలు చేసే వేళ, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ సిబ్బంది మరిన్ని వాహనాలు సమకూర్చుకుని కిక్కిరిసిన విధంగా కాకుండా, దూరదూరంగా కూర్చుని పోలింగ్ బూత్ లకు వెళ్లాలి. ఎన్నికల సిబ్బంది ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో ఉంటే, వారి స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలైనంత మంది రిజర్వ్డ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.

ఇక ఓటర్ల విషయానికి వస్తే, ముఖానికి నిర్దేశిత విధానంలో మాస్క్ తప్పనిసరి. మూతి, ముక్కు మూసుకునేలా మాస్క్ ధరిస్తేనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతిస్తారు. ఆపై అసలైన ఓటరును గుర్తించేందుకు ఒకమారు మాస్క్ తీయాల్సి వుంటుంది. ఆపై వెంటనే మాస్క్ ధరించాలి. ఓటేసే సమయంలో ఒక్కో ఓటరు మధ్య కనీసం 6 అడుగుల దూరం తప్పనిసరి. ఇందుకోసం ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో మార్కింగ్ చేయాలి.

కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలి. పోలింగ్ అధికారులు, సిబ్బందికి సరిపడినన్ని మాస్క్ లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్ లను ముందుగానే సిద్ధం చేయాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా ఇదే తరహా ముందు జాగ్రత్తలు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.