Apple: యాప్ డెవలపర్ల నుంచి తీసుకునే కమిషన్ ను తగ్గించిన యాపిల్!

  • ప్రస్తుతం స్టాండర్డ్ కమిషన్ రేటుగా 30 శాతం
  • కొత్త డెవలపర్లకు ప్రోత్సాహమిచ్చేలా ఇకపై 15 శాతమే
  • ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తామన్న టిమ్ కుక్
Apple Reduced Commission from Developers

కొత్త డెవలపర్ ప్రోగ్రామ్ ను ప్రకటించిన యాపిల్, డెవలపర్ల నుంచి వసూలు చేసే యాప్ స్టోర్ కమిషన్ రేటును 15 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. యాప్ స్టోర్ స్మాల్ బిజినెస్ ప్రోగ్రామ్ ను ప్రకటించిన యాపిల్, సాలీనా 1 మిలియన్ (సుమారు రూ.7.41 కోట్లు) వార్షిక అమ్మకాలను తమ యాప్స్ ద్వారా పొందే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి ఈ కొత్త ప్రోగ్రామ్ అమలులోకి వస్తుందని, ఇప్పటికే తమ యాప్స్ ను యాప్ స్టోర్ లో ఉంచిన డెవలపర్లకు కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఒకవేళ డెవలపర్ మిలియన్ డాలర్లకు మించిన ఆదాయాన్ని పొందితే, స్టాండర్డ్ కమిషన్ రేటు (30 శాతం) వర్తిస్తుందని, ఈ రేటు మిగిలిన ఏడాదంతా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం పెయిడ్ యాప్స్, ఇన్ యాప్ పర్చేజస్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ 30 శాతం స్టాండర్డ్ కమిషన్ ను తీసుకుంటోంది.

ఇక ఈ కొత్త డెవలపర్ ప్రోగ్రామ్ పై మరిన్ని వివరాలను డిసెంబర్ తొలి వారంలో డెవలపర్లకు అందిస్తామని, చెల్లించాల్సిన కమిషన్ తగ్గింపు సౌలభ్యాన్ని పొందాలంటే, ముందుగానే తమ యాప్స్ పేర్లను నమోదు చేసుకోవాల్సి వుంటుందని వెల్లడించింది. అంటే... అర్హత ఉన్న డెవలపర్లకు ఈ కొత్త రేటును ఆటోమేటిక్ గా యాపిల్ వర్తింపజేయబోదని అర్థం.

"ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంలో యాప్ స్టోర్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తోంది. లక్షల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. మంచి ఆలోచనతో వచ్చిన వారిని ఎంతో ప్రోత్సహిస్తున్నాం" అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. తన ఈ కొత్త కార్యక్రమం ప్రపంచ వృద్ధికి సహకరిస్తుందని, చిన్న యాప్ డెవలపర్లు ఎంతో లబ్దిని పొందుతారని, వారు కొత్త ఆలోచనలపై రిస్క్ తీసుకునే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News