China: కరోనా వైరస్ గురించి ప్రపంచానికి వెల్లడించిన చైనా విలేకరికి ఐదేళ్ల జైలు శిక్ష!

Chinese citizen journalist faces jail for Wuhan reporting
  • 37 ఏళ్ల సిటిజన్ జర్నలిస్టుపై పలు అభియోగాలు
  • గొడవలకు దిగుతూ, సమస్యలు సృష్టిస్తున్నారని అరెస్ట్
  • కనిపించకుండా పోయిన మరెందరో జర్నలిస్టులు
కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి వెల్లడించిన విలేకరికి చైనా ప్రభుత్వం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మాజీ న్యాయవాది అయిన 37 ఏళ్ల ఝాంగ్‌ఝాన్ సిటిజన్ జర్నలిస్ట్ కూడా. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైరస్ వెలుగు చూసిన వుహాన్ వెళ్లి వైరస్‌కు సంబంధించి పలు కథనాలు రాసింది.

కరోనా వైరస్‌పై ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు హింసించారని, కొందరు స్వతంత్ర విలేకరులు కనిపించకుండా పోయారంటూ తన కథనాల్లో పేర్కొంది. ఈ మేరకు చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (సీహెచ్ఆర్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. మరోవైపు, గొడవలకు దిగుతూ సమస్యలు సృష్టిస్తోందన్న ఆరోపణలతో మే నెలలో ఝాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు న్యాయవాదిని కలిసేందుకు ఆమెకు అనుమతి లభించింది.

తన అరెస్టుకు నిరసనగా ఝాన్ జైలులో నిరాహార దీక్షకు దిగిందని, సెప్టెంబరు 18న ఆమెను దోషిగా నిర్ధారించినట్టు ఆమె తరపు న్యాయవాదికి ఫోన్ వచ్చింది. వీచాట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో కొవిడ్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినట్టు రుజువు కావడంతో ఆమెకు శిక్ష విధించినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, వుహాన్‌లో ఝాన్‌లాంటి ఎంతోమంది జర్నలిస్టులు కనిపించకుండా పోయారు. వారిలో కొందరు ఆ తర్వాత కనిపించినా, చాలామంది జాడ ఇప్పటికీ తెలియరాలేదు.
China
journalist
Corona Virus
jail
Wuhan

More Telugu News