కేసీఆర్ దొరగారి కుట్రను ఓటర్లు అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్లు కాదు: విజయశాంతి

18-11-2020 Wed 21:09
  • టీఆర్ఎస్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉంది
  • వరద సాయం పేరుతో ఓట్ల రాజకీయం
  • ఓటర్లను మభ్య పెట్టి ఓ మహిళ మృతికి కారణమయ్యారు
Congress leader Vijayashanti slams KCR over flood assistance

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం తీరు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా ఉందని విమర్శించారు. వరద బాధితులకు సాయం పేరుతో కేసీఆర్ దొరగారు ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారని, ఇది కాదనలేని సత్యమని అన్నారు. వర్షాలు కురిసి మూడు వారాలు దాటుతున్నా బాధితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం వరద సాయం అందించలేకపోయిందన్నారు. ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైందన్నారు. సాయాన్ని అరకొరగా అందించడమే కాకుండా, నిజమైన బాధితులకు ఇవ్వకుండా విమర్శల పాలయ్యారని విజయశాంతి అన్నారు.

ఇప్పుడు బల్దియా ఎన్నికలకు రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వారికి దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఓ మహిళ మృతికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఇది ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కుట్రను గుర్తించి ఎన్నికలయ్యే వరకు వరద సాయం ఆపేయాలని ఈసీ ఆదేశిస్తే, టీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షాల ఫిర్యాదు వల్లేనని అనడం చూస్తుంటే ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుందని విమర్శించారు. కేసీఆర్ దొరగారి కుట్రను ఓటర్లు అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్లు కాదని విజయశాంతి అన్నారు.