చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తావా?: కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

18-11-2020 Wed 19:05
  • వరద సాయం పంపిణీని ఆపాలన్న ఎన్నికల సంఘం
  • దీనికి బీజేపీనే కారణమని ఆరోపించిన కేసీఆర్
  • తన సంతకాన్ని టీఆర్ఎస్ ఫోర్జరీ చేసిందన్న బండి సంజయ్
Bandi Sanjay challenges KCR to promice in Bhagya  Lakshmi temple

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో వరద సాయాన్ని నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని అన్నారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. 'వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా?' అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

వరద సాయం కోసం క్యూలో నిల్చున్న మహిళ చనిపోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం నిర్వహిస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందిస్తూ... గతంలో కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో జనాలంతా చూశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శించారు.