Andhra Pradesh: పడిపోయిన ధరలు...ఆర్టీపీసీఆర్ కిట్ రూ.55, ఎన్ 0 95 మాస్క్ రూ. 19

Price of Corona Kit Droped abaove 80 Percent
  • కరోనా తొలినాళ్లలో ఒక్కో కిట్ రూ.1000
  • సరఫరా పెరగడంతో దిగొచ్చిన ధరలు
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్ష రుసుము తగ్గింపు
  • భారీ ఎత్తున కిట్లకు ఆర్డర్ ఇచ్చిన ఏపీ
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన కొత్తల్లో రూ. 1000గా ఉన్న ఆర్టీపీసీఆర్ కిట్ ధర ఇప్పుడు రూ. 55కు పడిపోయింది. రూ. 150 వరకూ ఉన్న ఎన్-95 మాస్క్ ధర ఇప్పుడు రూ. 19కి దిగి వచ్చింది. ఏప్రిల్, మే మధ్య కాలంలో ఎక్కువ ధర చెల్లించినా లభ్యంకాని కరోనా కిట్ లు, ఇప్పుడు టెండర్ దక్కితే చాలు, ఎన్నయినా సరఫరా చేసేందుకు సిద్ధమంటూ క్యూ కడుతున్నాయి. ఇక ఈ కిట్ ల ధరలు భారీగా తగ్గడంతో, కరోనా పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం కూడా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ విజయ రామరాజు వెల్లడించారు.

మార్కెట్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ, తరచూ టెండర్లకు వెళ్లడం వల్లే ధరలు దిగి వచ్చాయని ఆయన అన్నారు. కరోనా తొలి దశలో ఒకరికి నిర్ధారణ పరీక్ష చేయాలంటే రూ. 4 వేల వరకూ అయ్యేదని, రోజుకు పరీక్షల కోసమే రూ. 5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ధరలు 80 నుంచి 90 శాతం వరకూ తగ్గడంతో ప్రభుత్వ వ్యయం కూడా తగ్గిందని విజయ రామరాజు తెలియజేశారు. ధరలు దిగి రావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరను రూ. 1,900 నుంచి రూ. 1000కి తగ్గించినట్టు తెలిపారు.

ఇక కొవిడ్ కొత్తల్లో ఉన్న ధరలను, ఇప్పటి ధరలను పరిశీలిస్తే, ఆర్టీ పీసీఆర్ కిట్ ధర రూ. 1000 నుంచి రూ. 55కు తగ్గింది. పీపీఈ కిట్ ధర రూ. 650 నుంచి రూ. 290కి, త్రీప్లై మాస్క్ రూ.13 నుంచి రూ. 2.50కు, ఎన్-95 మాస్క్ రూ. 150 నుంచి రూ. 19.50కు, వీటీఎం కిట్ రూ. 160 నుంచి రూ. 26కు, ఆర్ఎన్ఏ ఎక్ స్ట్రార్షన్ కిట్ రూ. 350 నుంచి రూ. 35కు తగ్గిపోయింది.
Andhra Pradesh
RTPCR Kit
Price
Masks

More Telugu News