పవన్ సినిమా ఇక సంక్రాంతికి లేనట్టేనా?

18-11-2020 Wed 06:40
  • కొంత గ్యాప్ తర్వాత పవన్ చేస్తున్న 'వకీల్ సాబ్' 
  • లాక్ డౌన్ తర్వాత ఇటీవల మొదలైన షూటింగ్
  • కొన్ని రోజులు షూటింగులో పాల్గొన్న పవన్
  • మళ్లీ బ్రేక్ తీసుకుని, రాజకీయాలలో బిజీ

Is Pawan movie not for Sankranthi anymore

కొంత కాలం గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. హిందీలో హిట్టయిన 'పింక్' సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ జరిగినా, ఆ తర్వాత ఏడు నెలల పాటు ఆగిపోయింది.

మళ్లీ ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా, పవన్ కల్యాణ్ కూడా కొన్ని రోజుల పాటు షూటింగులో పాల్గొన్నారు. అయితే, ఇంతలోనే ఆయన మళ్లీ బ్రేక్ తీసుకుని మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించారు. దీంతో మళ్లీ ఇక్కడ కూడా ఆయన బిజీ అవుతారు.

ఈ నేపథ్యంలో పవన్ మళ్లీ షూటింగులో పాల్గొని, పూర్తి చేసేసరికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఈ కారణం వల్ల ఇంతకుముందు అనుకున్నట్టు సంక్రాంతికి దీనిని విడుదల చేయడం కష్టమేనని, ఇక వచ్చే ఏడాది వేసవికే చిత్రం రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది.