రాజా రవీంద్ర చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ హీరో నిఖిల్

17-11-2020 Tue 19:14
  • 3 మొక్కలు నాటిన నిఖిల్
  • '18 పేజెస్' టీమ్ ను నామినేట్ చేసిన వైనం
  • ఎంపీ సంతోష్ కు ధన్యవాదాలు తెలిపిన నిఖిల్
Hero Nikhil and heroine Aishwrya Rajesh participated in Green India Challenge

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా సాగిపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పర్యావరణ హిత కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నారు. తాజాగా యువ హీరో నిఖిల్ కూడా ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. సీనియర్ నటుడు, తన మేనేజర్ రాజా రవీంద్ర విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన నిఖిల్ 3 మొక్కలు నాటారు.

అనంతరం తాను నటిస్తున్న '18 పేజెస్' చిత్రబృందాన్ని నామినేట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ తో పాటు అవికా గోర్, కలర్స్ స్వాతిలను కూడా నామినేట్ చేశారు. వారు 3 మొక్కలు నాటాలని, ఈ గొలుసును కొనసాగించాలని నిఖిల్ సూచించారు. ఈ కార్యాచరణ తీసుకువచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అటు, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కూడా ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. తెలుగు హీరో సుశాంత్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన ఐశ్వర్య 3 మొక్కలు నాటి తన సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. మొక్కలు నాటిన అనంతరం సుశాంత్ ఫ్యాన్స్ అందరినీ నామినేట్ చేశారు.