Arvind Kejriwal: ఆందోళన కలిగిస్తున్న కరోనా ఉద్ధృతి.. మార్కెట్లను మూసివేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం

  • ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • మార్కెట్లు హాట్ స్పాట్లుగా మారే అవకాశం ఉందన్న కేజ్రీవాల్
  • జనాలు అలసత్వంతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య
Arvind Kejriwal Seeks To Shut Delhi Markets Emerging As Corona Hotspots

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అలర్ట్ అయింది. మార్కెట్లను మూసి వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ విధించబోమని నిన్ననే కేజ్రీవాల్ ప్రకటించారు. ఒక రోజు వ్యవధిలో ఆయన ఈ కీలక నిర్ణయం గురించి మాట్లాడారు.

ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. మార్కెట్లలో జనాలు ఎక్కువగా పోగవుతున్నారని... ఇవి కరోనా హాట్ స్పాట్ లుగా మారే అవకాశం ఉందని అన్నారు. ఈ కారణంగానే మార్కెట్లను కొన్ని రోజుల పాటు మూసేయాలనే నిర్ణయానికి వచ్చామని, కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనను పంపామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రస్తుతం పెళ్లిళ్లకు 200 మంది వరకు అనుమతిస్తున్నామని... కానీ, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మళ్లీ పాత నిబంధన (50 మందికే అనుమతి)కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కేజ్రీవాల్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రపోజల్ ను లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపామని... ఆయన నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నామని  చెప్పారు.

దీపావళి సమయంలో చాలా మంది ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజికదూరం పాటించకుండా ఉండటాన్ని తాము గమనించామని కేజ్రీవాల్ అన్నారు. తమకు ఏమీ కాదనే ధోరణిలో జనాలు ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కరోనా ఎవరికైనా వస్తుందని, పరిస్థితిని దారుణంగా మారుస్తుందని చెప్పారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. మీ కోసం, మీ కుటుంబాల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

More Telugu News