సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

17-11-2020 Tue 14:59
  • వర్చువల్ విధానంలో పథకం ప్రారంభం
  • 14.58 లక్షల మంది రైతులకు లబ్ది
  • రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లకు పైగా జమ చేశామన్న సీఎం జగన్
AP CM Jagan launches YSR Zero Interest Agri Loans scheme

ఏపీలో మరో పథకం ప్రారంభమైంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లకు పైగా జమ చేసినట్టు వెల్లడించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. అన్నదాతలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు.

రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నామని, అక్టోబరులో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశామని, నెల లోపే రూ.132 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశామని సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీపై రూ.1,180 కోట్ల మేర బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు కూడా తామే చెల్లించామని చెప్పారు.  18 నెలల వ్యవధిలోనే 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని వెల్లడించారు.