Moderna: ఫైజర్ ను మించి ప్రభావం చూపుతున్న మోడెర్నా వ్యాక్సిన్!

  • 94.5 శాతం వరకూ పనిచేస్తోంది
  • ఇప్పటికే 30 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం
  • వ్యాక్సిన్ వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాలన్న బైడెన్
Moderna Vaccine is 05 Percent Effective

తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావాన్ని చూపుతున్నట్టుగా తేలిందని యూఎస్ కు చెందిన ఫార్మాస్యూటికల్‌ సంస్థ మోడెర్నా సోమవారం నాడు ప్రకటించింది. కరోనాను అంతం చేసే విషయంలో తాము ఎంఆర్‌ఎన్‌ఏ–1273 పేరిట అభివృద్ధి చేసిన టీకా బాగా పనిచేస్తోందని ట్రయల్స్ లో వెల్లడైనట్టు పేర్కొంది. ఇప్పటికే ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు అభివృద్ధి చేసిన టీకా 90 శాతం వరకూ పని చేస్తోందని ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అంతకు మించి మోడెర్నా వ్యాక్సిన్ పనిచేస్తే, తొలుత అమెరికాలో ఈ టీకానే వినియోగిస్తారని తెలుస్తోంది.
 
కాగా, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలోని డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు సైతం ఈ టీకా 94.5 శాతం పని చేస్తోందని తేలిందని మోడెర్నా తెలిపింది. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ దిశగా ఇదో కీలకమైన ముందడుగని అభిప్రాయపడింది. ఇక తమ టీకా వినియోగానికి వీలుగా యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్‌ ఆథరైజేషన్‌ (ఈయూఏ) నుంచి అనుమతులు కోరనున్నామని కూడా మోడెర్నా వెల్లడించింది. ఇతర దేశాల్లోని ఫార్మా కంపెనీలతోనూ డీల్స్ కుదుర్చుకునే యోచనలో ఉన్నట్టు తెలిపింది.

కాగా, మోడెర్నా, తన మూడవ దశ ట్రయల్స్ లో భాగంగా 30 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చి, వారి తొలి రిపోర్టులను పరిశీలించి, వాటిని బహిర్గతం చేసింది. "ఫేజ్ 3 ట్రయల్స్ తొలి ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. మా వ్యాక్సిన్ కొవిడ్-19ను నిరోధిస్తుంది. మరెన్నో ఇతర వ్యాధులు రాకుండానూ పనిచేస్తుంది" అని మోడెర్నా సీఈఓ స్టెఫానీ బాన్సెల్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేకంగా ప్రస్తావించిన అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్, "నేడు మనకు రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందన్న వార్త ఆనందాన్ని కలిగిస్తోంది. తొలి వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉన్నట్టే రెండో వ్యాక్సిన్ కూడా కనిపిస్తోంది. అయితే, ఇంకొన్ని నెలలు ఆగాల్సి రావచ్చు. అప్పటివరకూ అమెరికన్లు అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తుండాలి" అని అన్నారు.

ఇక ఇదే విషయమై ట్రంప్ స్పందిస్తూ, "మరో వ్యాక్సిన్ బయటకు రానుంది. అదే మోడెర్నా వ్యాక్సిన్. 95 శాతం పనిచేస్తుంది. గొప్ప చరిత్రకారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ చైనా ప్లేగును మనం అంతం చేయగలము" అని వ్యాఖ్యానించారు.

More Telugu News