కిషన్‌రెడ్డి అచేతనంగా ఎందుకు మారారు?: రేవంత్

17-11-2020 Tue 06:38
  • తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదు
  • వరదసాయం అవకతవకలపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు
  • బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పాలు, నీళ్లలాంటి బంధం
Congress leader Revanth Reddy Fires on Kishan Reddy

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కిషన్‌రెడ్డి అచేతనంగా మారిపోయారని అన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ఆయన చేతిలోనే ఉన్నప్పటికీ వరద సాయంలో జరిగిన దోపిడీపై విచారణకు ఆదేశించకుండా, విచారణ కోరడమేంటని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి అధికారాలకు పక్షవాతం ఎందుకొచ్చిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని మొత్తుకుంటున్న బీజేపీ నేతలు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని సూటిగా ప్రశ్నించారు.

నిజానికి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య బంధం పాలు, నీళ్లలాంటిదని, 'కిషన్‌రెడ్డి జెంటిల్‌మేన్' అంటూ కేటీఆర్ ఇచ్చిన సర్టిఫికెట్ అందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఇక, తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం లేదని, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వరదసాయం విషయంలో జరిగిన అవకతవకలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పని అయిపోయిందంటూ బీజేపీ అసత్య ప్రచారం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.