జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన తెలంగాణ ఇన్చార్జి

16-11-2020 Mon 21:50
  • త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు
  • హైదరాబాద్ పార్టీ ఆఫీసులో జనసేన శ్రేణుల సమావేశం
  • కష్టపడే వారికి ప్రాధాన్యత
Janasena set to face GHMC polls

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ  తెలంగాణ విభాగం ఇన్చార్జి శంకర్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాసమస్యలపై పోరాటాలు, సేవా కార్యక్రమాలకు పరిమితమైన జనసేన ఇక మీదట బూత్ స్థాయి నుండి బలోపేతమై ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.

జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడే జనసైనికులకు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. యువజన విభాగంతో పాటు విద్యార్థి విభాగం, వీర మహిళ విభాగాల సభ్యులు అందరూ జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు జనసేన నాయకత్వం హైదరాబాదు ప్రశాసన్ నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ నేతలు, విద్యార్థి, యువజన విభాగాలతో సమావేశం నిర్వహించింది.