ఏపీ పోలీస్ శాఖలో 6,500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్

16-11-2020 Mon 21:32
  • పోలీసు శాఖలో ఉద్యోగాల జాతర
  • ప్రతి ఏటా జనవరిలో పోలీసుల ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • వెల్లడించిన హోంమంత్రి సుచరిత
AP Police Recruitment notification will be released in January

ఏపీ పోలీస్ విభాగంలో మరోసారి కొలువుల జాతరకు తెరలేవనుంది. రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి 2021 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఇకపై ప్రతి ఏటా జనవరిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు హోంమంత్రి ట్వీట్ చేశారు.  

కాగా ఈ పోస్టుల భర్తీ నాలుగు దశల్లో ఉంటుందని ఇటీవల సీఎం జగన్ వెల్లడించారు. పలు శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు అందజేయాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడాది జనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు పూర్తిచేసేలా క్యాలెండర్ రూపొందించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

ఏపీలో 2019 నవంబరు నాటికి 340 ఎస్సై, 11,356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని పోలీసు నియామక మండలి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. పోలీసు నియామక మండలి ప్రతిపాదనలను పరిశీలించిన మీదటే తాజా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.