TS High Court: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలంటూ పిటిషన్ వేసిన దాసోజు శ్రవణ్ పై హైకోర్టు ఆగ్రహం

  • బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టును ఆశ్రయించిన దాసోజు
  • ఇప్పటివరకు ఏంచేశారంటూ కోర్టు వ్యాఖ్యలు
  • దురుద్దేశపూరితంగా పిల్ వేశారన్న న్యాయస్థానం
High Court denies to give stay on GHMC Elections

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఎన్నికలు ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కు చుక్కెదురైంది. బీసీలకు సంబంధించి సుప్రీం కోర్టు పదేళ్ల కిందట తీర్పు ఇస్తే ఇప్పటివరకు ఏంచేశారని దాసోజు శ్రవణ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎంబీసీలపై అంత ప్రేమ ఉంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న చివరి క్షణంలో బీసీల అంశం గుర్తొచ్చిందా? అని వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఆపాలన్న దురుద్దేశ పూరిత రాజకీయ ప్రణాళికతో ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్టు అర్థమవుతోందని పేర్కొంది. కావాలంటే పిల్ పై విచారణ జరపగలమేమో కానీ, ఎన్నికలు ఆపాలంటూ స్టే ఇవ్వడం మాత్రం కుదరని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, జీహెచ్ఎంసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు, దాసోజు శ్రవణ్ తన పిల్ లో బీసీల అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికలపై స్టే కోరారు. వాదనల సందర్భంగా...  రాష్ట్రంలో రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని, విద్యారంగంలో బీసీ రిజర్వేషన్లకు, రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లకు ఎంతో తేడా ఉందని శ్రవణ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

More Telugu News