'షోలే' చిత్రంలో గబ్బర్ సింగ్ లా డైలాగులు చెప్పి చిక్కుల్లో పడిన పోలీస్ అధికారి

16-11-2020 Mon 16:14
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • తన జీపులో తిరుగుతూ షోలే డైలాగులు పలికిన పోలీసు
  • షోకాజ్ నోటీసులు పంపిన ఉన్నతాధికారులు
Police officer caught in troubles after recites Sholay dialogues

బాలీవుడ్ అలనాటి బ్లాక్ బస్టర్ చిత్రం షోలేలో అనేక సూపర్ హిట్ డైలాగులున్నాయి. షోలేలో గబ్బర్ సింగ్ పాత్రధారి అంజాద్ ఖాన్ పలికిన ఆ డైలాగులు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతుంటాయి. 1975లో వచ్చిన ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ కెరీర్ లో భారీ హిట్ గా పేరుగాంచింది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన గబ్బర్ సింగ్ చిత్రంలో ఈ సినిమా డైలాగులు పలికాడు.  

అయితే మధ్యప్రదేశ్ లోని ఓ పోలీసు అధికారి కూడా ఈ తరహాలోనే పబ్లిగ్గా షోలే డైలాగులు పలికి చిక్కుల్లో పడ్డాడు. మధ్యప్రదేశ్ లోని జబువా పట్టణంలో పనిచేసే ఆ పోలీసు అధికారి తన జీపుకు అమర్చిన మైకులో గబ్బర్ సింగ్ లా డైలాగులు వల్లించాడు. కొన్ని డైలాగులకు తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేశాడు. పట్టణ వీధుల్లో తిరుగుతూ సినీ డైలాగులతో రెచ్చిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. పై అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఆ పోలీస్ అధికారికి షోకాజ్ నోటీసులు పంపారు. డైలాగులు చెప్పడంపై వివరణ అడిగారు. ఈ ఘటనలో చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ ఆనంద్ సింగ్ స్పష్టం చేశారు.