నేటి నుంచి కేదార్‌నాథ్ ఆలయం మూత.. 13 ఏళ్ల తర్వాత ఆలయాన్ని సందర్శించిన యోగి ఆదిత్యానాథ్

16-11-2020 Mon 10:10
  • కేదార్‌నాథ్‌లో విపరీతంగా కురుస్తున్న మంచు
  • మూసివేత నేపథ్యంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలు
  • నేడు బద్రీనాథ్‌లో అతిథిగృహ నిర్మాణానికి యోగి శంకుస్థాపన
Yogi Adityanath perform prayers at Kedarnath

శీతాకాలం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఆలయంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు గత అర్ధరాత్రి ఆలయాన్నిసందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

పూజల అనంతరం సీఎం యోగి మాట్లాడుతూ.. దేశ ప్రజల శ్రేయస్సు కోసం తాను 13 ఏళ్ల తర్వాత ఆలయాన్ని సందర్శించినట్టు చెప్పారు. కేదార్‌నాథ్ సందర్శన అనంతరం బద్రీనాథ్ బయలుదేరిన సీఎం.. ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న 40 గదుల పర్యాటక అతిథిగృహ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. 11 కోట్ల రూపాయల వ్యయంతో రెండేళ్లలో ఈ అతిథి గృహాన్ని నిర్మించనున్నారు.